Sankranthi 2026 Celebrations in UK : యూకేలోని బర్మింగ్‌హ్యామ్ నగరంలో సంక్రాంతి-2026 వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక భారతీయ సమాజం ఆధ్వర్యంలో 2026 జనవరి 17న నిర్వహించిన వేడుకల్లో పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు నిర్వహించిన భోగి పళ్లు కార్యక్రమం, మహిళలు పాల్గొన్న ముగ్గుల పోటీలు సందడి చేశాయి. అలాగే గాలిపటాల తయారీ, యువత పాల్గొన్న సనాతన ధర్మంపై ఉపన్యాస పోటీల కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ప్రదర్శించిన వివిధ నృత్యాలు కార్యక్రమానికి మరింత వైభవం చేకూర్చాయి. కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు. మహిళలు, పురుషులు తెలుగు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. పూల తోరణాలు, రంగురంగుల దీపాలు, గాలిపటాలు, మట్టి కళాఖండాలతో పల్లె నేపథ్యాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు శ్రీనివాస్ చెరుకుల, సిద్ధు రెడ్డి, మనోహర్ కొండాకు సంఘ సభ్యులు అభినందనలు తెలిపారు.
Comments