DY CM Bhatti on IPS Puran Kumar Death : ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చాలా బాధాకరమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయన బలవన్మరణానికి కారణమైన బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితులు ఈ దేశానికి, ప్రభుత్వాలకు మంచిది కాదని అన్నారు. పూరన్ కుమార్ కుటుంబాన్ని భట్టి విక్రమార్క పరామర్శించి, నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అనేక మెడల్స్ పొందిన పూరన్ కుమార్ తన సర్వీస్ అంతా అవినీతికి వ్యతిరేకంగా, వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు.అంతటి ఉన్నత స్థానంలో ఉన్న అధికారి తాను బతకలేనని ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని భట్టి విచారం వ్యక్తం చేశారు. తాను ఆత్మహత్య చేసుకునేందుకు కారకులైన ఇద్దరు అధికారుల వివరాలను పూరన్ కుమార్ తన డైయింగ్ డిక్లరేషన్లో ఇచ్చారన్నారు. దాని ఆధారంగా హరియాణా, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుని బాధ్యులను అరెస్టు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పూరన్ కుమార్ కుటుంబంతో మాట్లాడి, అండగా ఉంటామని చెప్పారని విక్రమార్క వివరించారు.
Be the first to comment