Roja Protest Nagari Counting : ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాల వద్ద మాజీ మంత్రి రోజా నిరసనకు దిగారు. విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థి మూడు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు ఆర్వో ప్రకటించారు. దీంతో రీకౌంటింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ అభ్యర్థితో కలిసి రోజా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్‌ను రోజా పక్కకు నెట్టేశారు. అనంతరం పోలీసులు కలగజేసుకొని ఆందోళనకారులను కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి పంపించేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మరోవైపు అనకాపల్లి జిల్లా కొత్తపల్లి అమల్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మునగపాక మండలం సిరసపల్లి ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి 17 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఓట్ల లెక్కింపుపై అభ్యంతరం వ్యక్తం చేసిన కూటమి నాయకులు రీకౌంటింగ్ నిర్వహించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.