కాకినాడ సమీపంలోని ఏటిమొగ వద్ద భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బకింగ్‌హామ్ కాలువలో నిలిపి ఉంచిన ఓ చేపల వేట బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బోటుతో పాటు అందులోని విలువైన వలలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ మత్స్యకారులు సకాలంలో అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డారు. మత్స్యకారుడు కామేశ్వరరావు గురువారం సాయంత్రం వేటకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా బోటులో డీజిల్ నింపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే బోటులో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే చుట్టుపక్కల దట్టమైన పొగ వ్యాపించింది. మంటలను గమనించిన బోటులోని మత్స్యకారులు అప్రమత్తమై వెంటనే కిందకు దిగేశారు. దీంతో పెను ప్రాణాపాయం తప్పింది.ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, మంటల తీవ్రతకు బోటు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో తమకు భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత మత్స్యకారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments