Eyewitness Upendra Hari on Bus Fire Accident : కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 19 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినట్టు ఉపేంద్ర హరి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెెలిపారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన ఉపేంద్ర హరి హైదరాబాద్ నుంచి కారులో ధర్మవరానికి వస్తుండగా చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ బస్సులో మంటలు వస్తుండటం గమనించారు. వెంటనే కారును పక్కకు ఆపి బస్సులో వారిని కాపాడేందుకు రాయితో బస్సు అద్దాలను పగులగొట్టాడు. అనంతరం కొంతమందిని కాపాడగలిగానని వెల్లడించారు. అయితే బస్సులో దట్టమైన మంటలు చెలరేగడంతో మిగిలిన వారిని కాపాడలేకపోయానని ఉపేంద్ర హరి ఆవేదన వ్యక్తం చేశారు."ఆఫీన్ పనిమీద రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లాను. అక్కడి నుంచి కారులో వస్తుండగా రహదారిపై ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగటం గమనించాను. అక్కడ బస్సు డ్రైవర్లు కూడా లేరు. పక్కనే రాయి ఉంటే దాంతో బస్సు అద్దాలను పగులకొట్టాను. అందులోనుంచి కొంత మంది బయటకు వచ్చారు. మరో అద్దం పగులగొట్టేందుకు ప్రయత్నించా. అప్పటికే బస్సులో మంటలు పూర్తిగా వ్యాపించాయి. అక్కడ ఉన్నవారిని వేరే వాహనంలో ఎక్కించి పంపించాను. అనంతరం నా మొబైల్‌తో పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేశాను." - ఉపేంద్ర హరి, ప్రత్యక్ష సాక్షి
Be the first to comment