Balakrishna Republic Day Celebrations : గణతంత్ర దినోత్సవ వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆస్పత్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, బసవతారకం ఆసుపత్రి సీఈఓ డాక్టర్ కృష్ణయ్య సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాన్సర్తో పోరాడి స్వరపేటిక కోల్పోయి లారింజెక్టమీ చేయించుకున్న వారు జాతీయగీతం పాడి ఆకట్టుకున్నారు. అనంతరం క్యాన్సర్ని జయించిన వారిని బాలయ్య సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం అన్నింటికీ మార్గదర్శకాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రతి భారత పౌరుడికీ హక్కులిచ్చిందన్నారు. అదే సమయంలో కర్తవ్యాలను గుర్తుచేసిందని తెలిపారు. రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు మన ప్రజాస్వామ్యానికి ప్రాణం వంటిదని కీర్తించారు. భారతదేశం ఒక భూభాగం కాదు ఇదొక సంస్కృతి, చరిత్ర, ఒక నిరంతర ప్రయాణమని పేర్కొన్నారు. వేల ఏళ్లుగా ఏన్నో రాజ్యాలు వచ్చాయి. ఎన్నో శక్తులు వచ్చి వెళ్లినా భారత్ తన విలువలతో ఎప్పుడూ నిలబడే ఉందని ఆయన ప్రస్థావించారు. ఈ కారణంగానే ప్రపంచమంతా నేడు భారత్ వైపు చూస్తోందని కొనియాడారు.
Comments