ఎల్నినో ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. కాగా కొంతలో కొంత పత్తి సాగు చేసిన రైతులను కూలీల కొరత వెంటాడుతోంది. పంట చేతికొచ్చి నెలరోజులు గడుస్తున్నా చేనులో అడుగుపెట్టని పరిస్థితి నెలకొంది. కొందరు రైతులు పొరుగున ఉన్న మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలకు వెళ్లి కూలీలను తీసుకొస్తున్నారు. వారికి రానుపోను ఖర్చులు, ఇంటివద్దనే వసతి, భోజన సౌకర్యం కల్పిస్తూ పత్తి కిలోకు రూ.10 కూలీ చెల్లిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని మండలంలోని నిపాని గ్రామానికి చెందిన రైతులు చెబుతున్నారు. కూలీ రూపేణా క్వింటాలుకు రూ.వెయ్యి, తేమ పేరిట వ్యాపారులు ధరలో కోత విధిస్తున్నారు. ఈ ఖర్చుతో మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నా కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి వీబీజీరాంజీ పథకాన్ని అనుసంధానిస్తే కూలీలకు, తమకు లబ్ధి చేకూరుతుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.