భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కుంభవృష్టి కురుస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వాగులు వంకలు, చెరువులు, పొంగి ప్రవహిస్తున్నాయి. సుమారు అన్ని గ్రామాల్లోని రహదారులు నీట మునగడంతో జనజీవనం స్తంభించింది. ఇళ్లలోకి నీరు చేరటంతో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గుమ్మడివల్లి సమీపంలో ఉన్నపెద్దవాగు ప్రాజెక్టులో నిర్మించిన తాత్కాలిక రింగ్ బండ్‌కు గండిపడింది. 2024 లో అతి భారీ వర్షాల కారణంగా పెద్దవాగు ప్రాజెక్ట్ ఆనకట్టకు పలుచోట్ల భారీగా గండ్లు పడ్డాయి. రెండు రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం కారణంగా నేటికీ మరమ్మతులు పూర్తి చేయలేదు. పెద్దవాగు ప్రాజెక్టు కింద తెలంగాణలో 2 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా, ఇక్కడి ప్రభుత్వం రూ.3.5 కోట్లతో ప్రాజెక్టు ఆనకట్టకు సమాంతరంగా తాత్కాలికంగా రింగ్ బండ్‌ను నిర్మించారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పైనుంచి ప్రవహించటంతో పలుచోట్ల గండ్లు ఏర్పడ్డాయి. పెద్దవాగు పరిసరాల్లో పొలాలు నీట మునిగాయి.
Comments