Etela Rajendar Padayatra : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టారు. ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద పాదయాత్ర ప్రారంభించిన ఈటల, మొత్తం 60 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. జవహర్‌నగర్ ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు పోరాడతామని ఈటల పేర్కొన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఈ సమస్యపై పోరాడిన సీఎం, ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ తొలగించి సిటీకి దూరంగా డంపింగ్ యార్డులను పెట్టి, కాలుష్యం లేని డంపింగ్ యార్డులాగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు.జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి వీచే గాలులతో దద్దుర్లు వచ్చి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఎన్జీటీలో, సుప్రీంకోర్టులో కేసు వేసి కొట్లాడారు. ముఖ్యమంత్రి పదవి వచ్చి మూడేళ్లవుతున్నా, అఖిలపక్ష నాయకులమందరం ఆయనను కలిసినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. హైదరాబాద్ చుట్టుపక్కల జనావాసాలు లేని చోట డంపింగ్ యార్డు 20 నుంచి 30 ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సమస్య పరిష్కారం కాని పక్షంలో ఈ ప్రాంత లక్షలాది ప్రజలతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. - ఈటల రాజేందర్, ఎంపీ