Cyclone Arnab Kakinada : అర్నబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తాళ్లరేవు మండలం హోప్ ఐలాండ్‌కు చెందిన సుమారు 130 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బోట్ల ద్వారా వారిని కాకినాడలోని తూరంగి ఐలాండ్ కాలనీకి చేర్చారు. మరోవైపు తొండంగి మండలం పెరుమాళ్లపురం పంచాయతీ పరిధిలోని చోడిపల్లిపేట తీర ప్రాంతంపై తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని స్పష్టం చేశారు. పలువురు అధికారులు సముద్ర తీర ప్రాంతాలను పరిశీలించారు. అత్యవసర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, ప్రజలకు సహాయం అందించేందుకు వీలుగా కాకినాడ జిల్లా, మండల స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వెల్లడించారు. ప్రజలు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కోరారు.