Dwaraka Tirumala TiruKalyana Mahotsavalu 2026 : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారికి మరో విడిది ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల అని చెబుతుంటారు. ఇక్కడ శ్రీనివాసుడు స్వయంభువుగా వెలసినందున ఈ ప్రాంతాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు. అలాగే ఏ కారణం చేతనైనా తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించలేని వారు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవచ్చు. అందుకే స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది.ఈ క్రమంలోనే స్వామివారి ఆశ్వయుజ మాస తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ శ్రీవారు శ్రీ రామపాదుక సమేత భరతుడు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఉదయం స్వామివారు హనుమద్వాహనంపై విహరించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. హనుమద్వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులతో నీరాజనాలు సమర్పించారు.