Snake Enters Car Engine in Budhera : పాము కనిపిస్తే వెంటనే అక్కడి నుంచి పరుగులు పెడతాం. అలాంటిది కారు ఇంజిన్లోకి నాగుపాము దూరితే ఇంకేముంది. ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో జరిగింది. తాటిపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య బుదేరాలో టీ స్టాల్ వద్ద టీ తాగుతుండగా పాము కారు ఇంజిన్ కిందకు వెళ్లింది. జనం అలికిడితో కంగారు పడిన పాము ఇంజిన్లోకి దూరింది. ఎంత శబ్దం చేసినా, కారు స్టార్ట్ చేసినా అది బయటకు రాలేదు. దీంతో పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్న సద్దాం అనే వ్యక్తి దాదాపు గంట పాటు శ్రమించి పామును బయటకు తీశారు. కారు ఇంజిన్ వేడితో పాటు బయటకు తీసే క్రమంలో నాగుపాముకు స్వల్పంగా గాయలయ్యాయి. దీంతో సద్దాం పాముకు సపర్యలు చేసి నీళ్లు తాగించాడు. నోటితో పాముకు గాలి ఊది శ్వాస ఆడేలా చేశాడు. అనంతరం బుదేరా సమీపంలోని అటవీ ప్రాంతంలో పామును వదిలేశాడు. సద్దాం ధైర్య సాహసాలను స్థానికులు అభినందించారు.
Be the first to comment