Bear Roaming at Marutla Village : మరుట్ల గ్రామ పొలాల్లో ఎలుగుబంటి సంచరిస్తోంది. అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల గ్రామం సమీప పొలాల్లో ఎలుగుబంటి సంచరిస్తుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. వివిధ పంటలు సాగు చేసిన రైతులు రాత్రి సమయంలో పొలాలలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. గ్రామానికి చెందిన రైతు చెన్నారెడ్డి కారులో కూడేరుకు వెళుతుండగా గ్రామం దాటిన కొద్ది దూరంలో ఎలుగు బంటి పొలాల నుంచి రోడ్డు పైకి వచ్చింది. దాన్ని రైతు చెన్నారెడ్డి వీడియో తీశారు. ఎలుగు బంటి రోడ్డుపై కొద్ది దూరం వెళ్లాక పొలాల్లోకి వెళ్లిపోయింది. ఎలుగు బంటి సంచారం గురించి తెలుసుకున్న రైతులు పొలాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని, ఎలుగు బంటి ఎప్పుడు దాడి చేస్తోందోనని భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి తరలించాలని రైతులు కోరుతున్నారు. వీటి దాడుల నుంచి తప్పించుకోవాలంటే అగ్గి ఒక్కటే మార్గమని పలువురు సూచిస్తున్నారు. నిప్పు చూస్తే అవి దూరంగా పారిపోతాయని తెలిపారు. చాలామంది ఎలుగుబంట్లను చూసి చెట్లు ఎక్కుతారని, కానీ అవి కూడా చెట్లు ఎక్కుతాయని అన్నారు.
Comments