Amla Ashok Ruia Interview : ఎడారి మనుషుల తడారిన బతుకులు చలింపజేశాయి. పల్లెజనం దాహం కేకలు, వలసగాథలు ఆమ్లారూయా మనసును కదిలించాయి. అది 1999 ఫిబ్రవరి. ఓ రోజు ఆమ్లారూయా టీవీ చూస్తున్నారు. రాజస్థాన్ కరవు కథనం ఆమె మనసును మెలిపెట్టింది. పత్రికా కథనాలు, జనం వలస గాథలు ఆలోచనలో పడేశాయి. గ్రామీణ భారతంలో ఇంత కఠిన పరిస్థితులు ఉన్నాయా అని మథనపడ్డారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్షేత్రంలోకి దూకారు. ప్రయోగాత్మకంగా మాండవర్ గ్రామంలో రెండు చెక్ డ్యాములు కట్టించారు. మూడేళ్లలో సాగు బాగైంది.తరువాత ఆశయ సాఫల్యానికి 'ఆకార్ ఛారిటబుల్ ట్రస్టు' ఏర్పాటుచేశారు. రాజస్థాన్‌తో మొదలుపెట్టి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్ సహా 11 రాష్ట్రాలకు జలయజ్ఞాన్ని విస్తరించారు. రెండున్నర దశాబ్దాల కృషితో 814 చెక్ డ్యాములు, 494 నీటికుంటలకు ఊపిరి పోశారు. ఆమె ఎన్నో ఊళ్ల నీటికష్టాలు తీర్చి "వాటర్ మదర్ ఆఫ్ ఇండియా"గా పేరొందారు. ఆమె సేవలకు అనేక అవార్డులు దక్కాయి. 2008 ఫిక్కీ ఎఫ్ఎల్ఓ మొదలు 2025లో జమ్నాలాల్ బజాజ్ వరకు అనేక సంస్థలతో అవార్డులతో సత్కరించాయి. ఇదేబాటలో రామోజీ గ్రూప్ 'ఎక్సలెన్స్ అవార్డు'తో ఆమ్లా రూయాను గౌరవించింది.
Be the first to comment