Electric Trucks Usage in Maha Cement Industry At Anakapalli District: దేశంలో తొలిసారిగా పరిశ్రమలో ఎలక్ట్రిక్ బల్క్ ట్యాంక్ లారీల వినియోగానికి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ములకలపల్లిలో ఉన్న మై హోం ఇండస్ట్రీస్ మహాసిమెంట్ కర్మాగారం శ్రీకారం చుట్టింది. ఈ పరిశ్రమకు ముడిసరకును తీసుకురావడానికి, తయారైన సిమెంట్‌ను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఎనిమిది ఎలక్ట్రిక్ బల్క్ ట్యాంక్ లారీలను సోమవారం యాజమాన్యం ప్రారంభించింది. ఒక్కో లారీ ఖరీదు రూ.1.20 కోట్లు కాగా, రూ.10 కోట్లు వెచ్చించి తొలి విడతలో 8 వాహనాలు కొనుగోలు చేశారు. వీటికి 30 నుంచి 35 టన్నుల వరకు బరువు మోయగల సామర్థ్యం ఉంది. గంటలోనే పూర్తిస్థాయి ఛార్జింగ్ అయ్యే ఈ ఎలక్ట్రిక్ లారీలు ఒకసారి పూర్తిస్థాయి ఛార్జింగ్‌తో 190 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తాయి. వీటికోసం ఈ కర్మాగారం ప్రాంగణంలోనే రెండు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నుంచి బూడిదను మహాసిమెంట్ కర్మాగారానికి తీసుకురావడానికి, ఇక్కడి నుంచి సిమెంట్‌ను భారీ భవనాల నిర్మాణానికి బల్క్‌గా తరలించడానికి వీటిని ఉపయోగిస్తామని మైహోం ఇండస్ట్రీ మార్కెటింగ్ సీనియర్ జీఎం టి. వీరారెడ్డి చెప్పారు. వీటి వినియోగం ద్వారా కేవలం తమ పరిశ్రమ ప్రాంగణంలోనే ఏటా 400 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించవచ్చన్నారు.
Comments