Amalapuram Vasavi Kanyaka Parameswari Temple : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి ప్రసిద్ధ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో భక్తులను విశేషంగా ఆకట్టుకునే రీతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని నూతన కరెన్సీ నోట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.ఈ ప్రత్యేక అలంకరణ కోసం ఏకంగా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల విలువైన సరికొత్త కరెన్సీ నోట్లను ఉపయోగించారు. ఈ రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా కొలిచారు. పిల్లాపాపలతో సహా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి స్వరూపంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దివ్య రూపాన్ని తిలకించడానికి భక్తులు బారులు తీరారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.