Chedi-Talankhana performances In Amalapuram : డాక్టర్ బీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో విజయదశమి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ఊరేగింపులో ప్రదర్శించిన సాహసోపేతమైన 'చెడి-తళంఖానా' (సాంప్రదాయ యుద్ధ కళలు) ప్రదర్శనలు భక్తులను, ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠకు గురిచేశాయి. ఈ విన్యాసాలను తిలకించేందుకు పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పట్టణానికి చెందిన యువకులు సాంప్రదాయ ఆయుధాలతో చేసిన యుద్ధ విన్యాసాలు అద్భుతాన్ని ఆవిష్కరించాయి. కత్తులు, కర్రలు తిప్పుతూ వారు చేసిన విన్యాసాలు, ప్రజ్వలిస్తున్న కాగడాలతో ప్రాణాలకు తెగించి చేసిన సాహసాలు చూసేవారిని అబ్బురపరిచాయి. యువత ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ 'చెడి-తలంఖానా' సంప్రదాయానికి దాదాపు 150 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. నాటి రోజుల్లో అబ్బిరెడ్డి రామదాసు ఈ వినూత్న యుద్ధ కళా ప్రదర్శనల సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి నేటి వరకు ఏటా విజయదశమి రోజున ఈ పట్టణ యువకులు పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న ఈ సాహసోపేత ప్రదర్శనలను ఏమాత్రం చెక్కుచెదరకుండా, అదే ఉత్సాహంతో కొనసాగిస్తూ వస్తుండటం విశేషం. దసరా వేడుకల్లో భాగంగా అమలాపురంలో ప్రదర్శించే ఈ యుద్ధ కళా వైభవం కోనసీమ సంస్కృతికి అద్దం పడుతోంది.