Chain Snatching In Dammaiguda Hyderabad : సికింద్రాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. దమ్మాయిగూడ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న స్వరూప అనే మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును దుండగులు అపహరించుకొని పరారయ్యారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయినట్లు కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. స్వరూప అనే మహిళ పలువురి ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ ఇంట్లో పని పూర్తి చేసుకుని బయటకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్‌మాస్క్‌లు ధరించి బంగారు గొలుసును చోరీ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Be the first to comment