Peddamadduru Farmer has Given Land to Pooling : ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం సంతోషంగా భూములు ఇచ్చి రాజధాని అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని పలువురు అన్నదాతలు పేర్కొన్నారు. అమరావతి మండలం పెదమద్దూరు సీఆర్డీఏ యూనిట్ కార్యాలయాన్ని సత్తనపల్లి ఆర్డీవో రమాకాంత్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమరావతి మండలం పెదమద్దూరు గ్రామానికి చెందిన రైతు కిలారు వెంకట్రావు భారీగా తన భూమి మొత్తం 21 ఎకరాల 71 సెంట్ల భూమిని బుధవారం సీఆర్డీఏ అధికారులకు అందించారు. బుధవారం ఒక్కరోజే మొత్తం 39.97 ఎకరాలు రాజధాని అమరావతి కోసం భూములు అందించారు. రైతు కిలారు వెంకట్రావుని సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి రమాకాంత్ రెడ్డి, సీఆర్డీఏ పెదమద్దూరు యూనిట్ డిప్యూటీ కలెక్టర్ ఎన్. యేసురత్నంకు అందజేశారు.రైతు కిలారు వెంకట్రావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రైతు కిలారు వెంకట్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం కోసం రాజధాని అమరావతి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, ఐదు కోట్ల మందికి రాజధాని అమరావతి అని అటువంటి రాజధాని కోసం భూమిని ఇవ్వటం రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా మాకు పెదమద్దూరు రెవెన్యూ పరిధిలో ఉన్న 21 ఎకరాల 71 సెంట్ల భూమి మొత్తాన్ని సంతోషంగా ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ మీద నమ్మకంతో భూములు ఇస్తున్నామన్నారు. మిగతా రైతులు కూడా త్వరగా భూములు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరొక రైతు ఆలూరి ఉదయలక్ష్మి కూడా బుధవారం 9 ఎకరాల 50 సెంట్లు భూమిని సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్కు అందజేశారు. తరువాత పెదమద్దూరు గ్రామ రైతుల తోటి సమావేశమైన సత్తెనపల్లి రెవిన్యూ డివిజనల్ అధికారి రమాకాంత్ రెడ్డి రైతులకున్న భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని అక్కడే ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి కోటేశ్వరరావుకు ఆదేశాలు ఇచ్చారు.
Comments