Manginapudi Beach Closed Due to Montha Cyclone Effect : రాష్ట్రం వైపు 'మొంథా' తుపాను దూసుకొస్తోంది. ఈ తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ అల్లకల్లోలంగా మారింది. బీచ్‌లోకి ఎవరూ రాకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీచ్ ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. తీరానికి వచ్చిన వారిని వెనక్కు పంపిస్తున్నారు. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మొంథా తుపాను గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తరుముకొస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలో కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 610 కిలోమీటర్ల దూరంలో పయనిస్తోంది. చెన్నై తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలో పోర్టుబ్లెయిర్‌కు పశ్చిమంగా 750 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. కార్తిక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు సముద్ర స్నానానికి వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Be the first to comment