MLA Nandamuri Balakrishna Casts his Vote in Hindupur : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి వసుంధరతో కలిసి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం చౌడేశ్వరి కాలనీలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమానికి, మంచి నాయకులను ఎన్నుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరోవైపు గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి ఓటు వేశారు. విజయవాడలో కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధా, స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు ఓటు వేశారు.