Feast with 145 Types of Dishes for Son-In-Law In West Godavari District: గోదావరి జిల్లాలు అంటేనే అతిథి మర్యాదలకు పెట్టింది పేరు. సామాన్యంగా అల్లుళ్లంటే మర్యాదలెక్కువ. అందులోనూ ఉభయ గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువ. ఇక సంక్రాంతి పండుగకు గాని కొత్త అల్లుళ్లు ఇంటికి వస్తే ఆ హంగామా అంతా ఇంతా ఉండదు. కాస్త తెలిసిన వారు వస్తేనే భోజనం చేయకుండా పంపించని గోదావరి జిల్లా వాసులు, ఇక ఇంటికి కొత్త అల్లుడు వస్తే ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణానికి చెందిన హారిక శ్రీలక్ష్మీకి రాజమండ్రికి చెందిన సాయి సత్య స్వరూప్‌తో గతేడాది అక్టోబర్‌లో వివాహమైంది. అయితే తొలిసారిగా సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఆ అత్తమామలు భారీ విందును ఏర్పాటు చేయడం విశేషం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 145 రకాల వంటకాలను వండి వడ్డించడమే కాకుండా దగ్గరుండి మరీ కొసరి కొసరి తినిపించి తమ ప్రేమను చాటుకున్నారు. "మా కుమార్తె హారిక శ్రీలక్ష్మీకి రాజమండ్రికి చెందిన సాయి సత్య స్వరూప్‌తో గతేడాది అక్టోబర్‌లో వివాహమైంది. అయితే మొదటిసారిగా మా కొత్త అల్లుడు సాయిసత్య స్వరూప్ మా ఇంటికి రావడంతో అతన్ని సర్ఫ్రైజ్ చేయాలనే ఉద్దేశంతో 145 రకాల వంటకాలను వండి సిద్ధం చేశాం. సాధారణంగా కొత్త అల్లుళ్లకు మర్యాదలు ఎక్కువగానే ఉంటాయి. అందులోనూ మా గోదారి జిల్లాల్లో ఇంకాస్త ఎక్కువ మర్యాదలే ఉంటాయి. స్వయంగా వంటలను వండి మా అల్లుడికి వడ్డించడం మాకెంతో సంతోషంగా ఉంది"- కంచల నాగమణి,సాయి, అత్తమామలు
Be the first to comment