Vice President At Tiruchanuru : భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం అమ్మవారి సేవలో పాల్గొన్నారు. తిరుమల నుంచి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకున్న ఉపరాష్ట్రపతికి తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన ఆయనకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా ‘ఇస్తికఫాల్’ స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన ఉపరాష్ట్రపతి ముందుగా ఆలయ ధ్వజస్తంభాన్ని, అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఉపరాష్ట్రపతికి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేసి వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి దర్శనం అనంతరం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తన రెండు రోజుల తిరుమల తిరుపతి పర్యటనను ముగించుకుని తిరుగుపయనమయ్యారు. రేణిగుంట విమానశ్రయంలో జిల్లా ఇన్‍చార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.