Full Rush in Ravulapalem RTC Bus Stand : కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిచెందిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. ఏడు శనివారాల నోము నోచుకునే మహిళ భక్తులు వేల సంఖ్యలో తరలి రావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. బస్సు ఎక్కాలంటే సాహసం చేయాల్సిందే. స్త్రీ శక్తి పథకంతో వాడపల్లి ఆలయానికి మహిళా భారీగా తరలివచ్చారు. అధిక సంఖ్యలో మహిళలు తరలి రావడంతో బస్టాండ్‌లో కూర్చొనేందుకు కూడా అవకాశం లేదు. బస్టాండ్‌కు వచ్చేవారు, వెళ్లేవారు కలిపి సుమారు 60 వేల మంది ఉంటారని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బస్టాండ్ నుంచి రోజుకు సుమారు 600 ట్రిప్పులు తిరుగుతుండగా శనివారం ఒక్క వాడపల్లికే 300 ట్రిప్పులు తిరిగాయి. బస్సుల సంఖ్య సరిపోకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చివరికి వచ్చిన బస్సుల్లోనే కిక్కిరిసి ప్రయాణం చేశారు. తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఏలూరు డిపోలకు బస్సులు మధ్యాహ్నం 3 తర్వాత తక్కువ వస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Be the first to comment