Telangana Samagra Kutumba Survey : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6 నుంచి ఇళ్ల గుర్తింపు కార్యక్రమం, అలాగే 9వ తేదీ నుంచి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైంది. సర్వే మొత్తం సాఫీగానే సాగుతోంది. కానీ హైదరాబాద్లో అక్కడక్కడ సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లను యజమానులు దూషించడం, వివరాలు ఇవ్వడం జరగదు అని చెబుతున్న కొన్ని ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే సర్వేలో ఫ్రిజ్లు, టీవీలు, ఏసీలు, కారు, ద్విచక్ర వాహనం ఇలా అన్ని వివరాలు వెల్లడిస్తే ప్రస్తుతం వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని కొందరు సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లో జరుగుతున్న సర్వేను పర్యవేక్షించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.
'సర్వే సమాచారం గోప్యంగా రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తుంది. ఈ సమాచారం సేకరించడంతో ఎవరికీ కూడా ఏ ప్రభుత్వ పథకాలు నిలిచిపోవు. ఇంకా అదనంగా పథకాలు ఇవ్వడానికి సేకరిస్తున్న సమాచారాన్ని ఉపయోగిస్తాం. దీన్ని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదు. దీనిపై అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా, పారదర్శకంగా ప్రభుత్వం సమాచారం సేకరిస్తుంది. ఈ సర్వేకు రాజకీయాలతో సంబంధం లేదు. కేబినెట్ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించిన తర్వాత సర్వే చేస్తున్నాం. ఎన్యూమరేటర్లపై దూషణలకు దిగితే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు.
Be the first to comment