BRS MLA Kotha Prabhakar Reddy Fires on Telangana Govt : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్న ఎమ్మెల్యేగా తనకు ఇంకా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శాసనసభలో పద్దులపై చర్చలో భాగంగా ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అంటూ గతంలో కాంగ్రెస్ నేతలు బద్నాం చేశారని, అయితే ఇప్పుడు మధిర, కొడంగల్ నియోజకవర్గాలకు నిధులను తరలిస్తున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో ఆరోపించారు. అందుకే మీకు(అధికారపక్షానికి) ప్రశ్నించే హక్కులేదని పేర్కొన్నారు.
అప్పుడు అలా చేశామనే మమ్మల్లి(బీఆర్ఎస్ పార్టీ) ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, మరి మీరు కూడా ఇక్కడ కూర్చుంటారా అంటూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఏదైనా శాఖకు ప్రతి ఏటా బడ్జెట్ పెరుగుతుంది కానీ తగ్గడం ఏంటని ప్రశ్నించారు. నిధులు లేక గ్రామాలు ఏడుస్తున్నాయని ఆవేదన చెందారు. కుక్కలు, పందులు బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని వివరించారు. కానీ బీఆర్ఎస్ పాలనలో గ్రామీణాభివృద్ధి బాగా జరిగిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.