Establishing New Medical Labs In State : రాష్ట్రంలో కొత్తగా 13 ప్రజారోగ్య లేబరేటరీలు రాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను మరింత చేరువ చేసేందుకు ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటవుతున్న ఈ లేబరేటరీలు మార్చి, ఏప్రిల్ నాటికి వినియోగంలోకి వస్తాయని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సంక్రమిక, అసంక్రమిక వ్యాధులకు సంబంధించి మొత్తం 134 రకాల వైద్యపరీక్షలు ఈ లేబరేటరీల్లో జరుగుతాయని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, అనంతపురం జిల్లా గుంతకల్లు, చిత్తూరు జిల్లా పలమనేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు, పల్నాడు జిల్లా నరసరావుపేట, విశాఖ జిల్లా అగనంపూడి, నంద్యాల జిల్లా బనగానపల్లి, బాపట్ల జిల్లా చీరాల, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రుల్లో ఈ లేబరేటరీలు నిర్మాణాలు పూర్తయ్యాయి.కాకినాడ జిల్లా తుని, నెల్లూరు జిల్లా గూడూరు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఆసుపత్రుల్లో ల్యాబ్స్ నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం ల్యాబ్ వంటి చోట్ల ఇప్పటికే వచ్చిన పరికరాలు, యంత్రాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక యంత్రాల ద్వారా హెచ్ఐవీ నిర్ధారణ, హెపటైటిస్, క్షయ వంటి పరీక్షలు కూడా వీటిలో జరుగుతాయి. పీఎం అభిమ్ కింద ఒక లేబరేటరీ నిర్మాణం, పరికరాల ఏర్పాటుకు కలిపి 1.25 కోట్ల చొప్పున 13 లేబరేటరీలకు కలిపి మొత్తం 16.25 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం వెచ్చిస్తోంది.
Comments