ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ చెల్లింపులే జరుగుతున్నాయి. ఛాయ్‌వాలా నుంచి కిరాణ కొట్టు వరకు ప్రతి చిన్నదానికి సైతం ప్రజలు డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడిపోయారు. జేబులో డబ్బులు ఉంచుకోవడంలేదు. నేరుగా డిజిటల్ చెల్లింపులకే ఇష్టపడుతున్నారు. ఇలాంటి తరుణంలో టీజీఎస్ఆర్టీసీ సైతం ఆ దిశగా ఆలోచనలు చేసింది. ఇప్పటికే ఓలా, ఊబర్ వంటివి డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఆర్టీసీ సైతం ప్రయాణికులను తమవైపు తిప్పుకోవడానికి డిజిటల్ చెల్లింపులకు అవకాశం కల్పించాలని భావిస్తుంది. అందులో భాగంగానే డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది.
ఆర్టీసీ బస్సులలో డిజిటల్ పేమెంట్ విధానాన్ని కొత్తగా అమల్లోకి తీసుకువస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే విమానాశ్రయానికి నడిపించే బస్సుల్లో ప్రయోగాత్మకంగా డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేశారు. ఈ విధానం విజయవంతం కావడంతో ఇటీవలే టికెట్ జారీకి డిజిటల్ పేమెంట్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని అన్ని మార్గాలలో నడుస్తున్న దాదాపు 40 ఎయిర్ పోర్టు బస్సులలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని అమలు పరుస్తున్నట్లు సికింద్రాబాద్ రీజినల్ అధికారులు తెలిపారు. వీటితో పాటు బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్ సిటీ బస్సులకు ఐ-టిమ్స్‌ను ఇచ్చారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాంతరానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆధునిక సాంకేతికతను విస్తరించాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. కండక్టర్లకు 10 వేల ఐ-టిమ్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.