జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలనకు రాష్ట్రపతి ఆమోదం

  • 6 years ago
President Ram Nath Kovind today approved the imposition of governor's rule in Jammu and Kashmir, a day after the BJP pulled out of its alliance with the Peoples Democratic Party (PDP) in Jammu and Kashmir.

జమ్ము కాశ్మీర్‌లో గవర్నర్ పాలనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. జమ్ము కాశ్మీర్‌లో పరిణామాలు, కాల్పుల విరమణ ఒప్పందం అంశంపై విభేదాల కారణంగా మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చింది. దీంతో ముఫ్తీ రాజీనామా చేశారు. గవర్నర్ పాలనకు రికమెండ్ చేయగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. 87 స్థానాలున్న జమ్ము కాశ్మీర్‌‌లో 2014లో జరిగిన ఎన్నికల్లో పీడీపీకి 28, బీజేపీకి 25 సీట్లు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 15, కాంగ్రెస్‌కు 12 సీట్లు వచ్చాయి. ఇతరులకు ఏడు దక్కాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరితోనూ చేతులు కలపబోమని ముఫ్తీ రాజీనామా అనంతరం... నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ పార్టీలు స్పష్టం చేశాయి.దీంతో గవర్నర్‌ పాలన అనివార్యం అయింది.
రాష్ట్రంలో 1977 నుంచి గవర్నర్‌ పాలన ఇది ఎనిమిదోసారి అవుతుంది. ఎన్నికల్లో బీజేపీ, పీడీపీ పరస్పరం తీవ్రంగా విమర్శించుకుంటూ ప్రచారం చేసినా ఎన్నికల అనంతరం ఉమ్మడి అజెండాతో కూటమిగా ఏర్పడ్డాయి. అయితే రెండు పార్టీలు చాలా విషయాల్లో విభేదిస్తూనే వచ్చాయి. కాగా, మెహబూబా రాజీనామా సమర్పించిన అనంతరం గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా.. ముఫ్తీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రవీందర్‌ రైనా, నేషనల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఒమర్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జిఎ మిర్‌తో సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన సంఖ్యాబలం తమకు లేదని మిర్‌ తెలిపారు. గవర్నర్‌ పాలన, ఎన్నికలకు ప్రత్యామ్నాయం లేదని గవర్నర్‌తో ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ప్రత్యామ్నాయ కూటములతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలరా అని మెహబూబాను, బీజేపీని గవర్నర్‌ అడిగారు. వారు చేయలేమని చెప్పారు. దీంతో రాష్ట్రపతికి నివేదిక పంపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేంతవరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని మెహబూబాకు సూచించారు.