Police Raided A Impurity Cooking Oil Manufacturing Unit : కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ధర్మవరం గ్రామంలో కల్తీ నూనె తయారు చేస్తున్న స్థావరంపై ప్రత్తిపాడు పోలీసులు దాడి చేశారు. 56 డబ్బాల్లో నిల్వ ఉంచిన 840 కేజీల కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నూనె తయారు చేస్తున్న 9 మంది ముఠాలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మరో 8 మంది కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు వివరాలను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు వెల్లడించారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో తాటిపర్తి గ్రామానికి చెందిన నమా నాగూర్, నానిబాబులు కలిసి కల్తీ వంట నూనెలు తయారు చేయిస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కల్తీ నూనెకు అవసరమైన 60 కేజీల క్రూడాయిల్, 840 కేజీల కల్తీ వంట నూనె, 26 ఖాళీ డబ్బాలు స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. జంతు కళేబరాలు, క్రూడాయిల్‌తో తయారు చేసిన ఈ కల్తీ ఆయిల్‌ను ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తున్నారన్నారు. పిఠాపురం మండలం ఎస్కే పాలేనికి చెందిన బండారు ఫణి ప్రసాద్‌ను అరెస్ట్ చేశామని, మరో 8 మంది కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు. ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, ఎస్సై లక్ష్మి కాంతం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments