BRS MLA Jagadish Reddy on Telangana Electricity : విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్ దక్కలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. సీలేరు విద్యుత్ ప్లాంట్ కోసం 7 మండలాలను ఏపీలో కలుపుతున్నారన్నారు. ప్రైవేటు కంపెనీల నుంచి కూడా విద్యుత్ కొనకుండా తెలంగాణపై కుట్రలు చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు తనకు తెలిసిన సమాచారాన్ని పంపామని, గత ప్రభుత్వంపై అర్థం లేని రాజకీయ ఆరోపణలు కొందరు చేశారని వాటికి సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ నేత జగదీశ్ రెడ్డి తెలిపారు. కమిషన్ చేసిన వ్యాఖ్యలపై కూడా తన అభిప్రాయాన్ని తెలిపానని అన్నారు. కొందరు కుహన మేధావులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్, అప్పటి ప్రభుత్వంపై బురద జల్లుదామని, అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు చేసే కుట్ర అది అని ధ్వజమెత్తారు.