బాలీవుడ్‌లో గతంలో వచ్చిన 'రేస్', 'రేస్-2' చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకున్నాయి. ఈ రెండు సిరీస్ చిత్రాల్లో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటిస్తే.... తాజాగా 'రేస్-3'లోకి సల్మాన్ ఖాన్ ఎంటరయ్యాడు. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈద్ సందర్భంగా గ్రాండ్‌గా విడుదలైంది. గత రెండు సిరీస్‌లతో పోలిస్తే 'రేస్-3' ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది? ప్రతి సంవత్సరం ఈద్ సందర్భంగా విడుదలయ్యే చిత్రాలతో బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్స్ నమోదు చేస్తున్న సల్మాన్ ఖాన్ ఈసారి కూడా అలాంటి విజయమే అందుకునే అవకాశం ఉందా? రివ్యూలో చూద్దాం... శంషీర్ సింగ్( అనిల్ కపూర్) ఒకప్పుడు ఇండియాలో ఆయుధాల వ్యాపారి. ఇండియాలో రాజకీయ నాయకులతో ఏర్పడ్డ గొడవల వల్ల తన మకాం దుబాయ్‌కి మారుస్తాడు. ఇక్కడ తన నేరసామ్రాజ్యాన్నివిస్తరిస్తాడు. శంషీర్ సింగ్‌కు ముగ్గురు పిల్లలు. సికిందర్ సింగ్ (సల్మాన్ ఖాన్), సూరజ్ సింగ్ (సాఖిబ్ సలీమ్), సంజన (డైసీ షా). వీరికి నమ్మకమైన బాడీగార్డ్ యష్(బాబీ డియోల్). శంషీర్ సింగ్ గ్యాంగ్ అపోజిట్ గ్యాంగ్ రానా (ఫ్రెడ్డీ దరువాలా) గ్యాంగ్. శంషీర్ మీద పైచేయి సాధించడానికి రానా చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ ప్రతిసారి విఫలం అవుతుంటాడు. సికిందర్, సంజన, సూరజ్, యష్ కలిసి.... రానా ఆటలు సాగనివ్వకుండా దెబ్బకొడుతుంటారు. సికిందర్, సూరజ్, సంజనలకు..... వారి తల్లి చనిపోయే ముందు ఆస్తి పంచుతూ విల్లు రాస్తుంది. అందులో సికిందర్‌కు 50%.... సూరజ్, సంజన కు కలిపి 50% చెందేలా వీలునామా రాస్తుంది. తమకు తక్కవ ఆస్తి దక్కిందన్నకోపంతో అన్నయ్యపై సూరజ్, సంజన కక్ష పెంచుకుంటారు. అతడిని దెబ్బకొట్టేందుకు ప్లాన్స్ వేస్తుంటారు.