Union Minister Arun Jaitley talks with Telugudesam Party leader Sujana Choudhary over AP issues on Friday.And jaitley also called and invited Chandrababu to Delhi for discuss AP issues
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కొన్ని డిమాండ్లకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై కేంద్రంపై టీడీపీ గత కొద్ది రోజులుగా యుద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఏపీకి హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుతున్నామని బీజేపీ గట్టి కౌంటర్ ఇస్తోంది. ఇటీవలే రెండు పార్టీల మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రతి రోజు ఢిల్లీలోని ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పార్లమెంటులో ఎలా వ్యవహరించాలో చెబుతున్నారు. అక్కడ విషయాలు తెలుసుకుంటున్నారు. వైసీపీ కూడా ఉద్యమిస్తోంది. ఇరు పార్టీలు కేంద్రంపై ఆరు రోజులుగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో జైట్లీ సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చారు. ఈ రోజు (శుక్రవారం) జైట్లీ తనతో మాట్లాడారని, రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం సహా అన్నీ ఇస్తామని చెప్పారని చంద్రబాబుతో సుజన చెప్పారు. అయితే ప్రత్యేక హోదా గురించి మాత్రం ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఏం చేద్దామని చంద్రబాబును సుజన అడిగారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా జైట్లీ ఫోన్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. హామీలను నెరవేర్చుతామని, ఢిల్లీకి రావాలని అడిగినట్లుగా తెలుస్తోంది . ఏం చేద్దామని సీనియర్ నేతలను చంద్రబాబు అడిగారు. దానికి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణ స్పందించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా అంశాలు ఇలా అన్ని విషయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని యనమల చెప్పారు. ఎవరైనా కనిపించినప్పుడు మర్యాదగా పలకరించుకోవచ్చునని, కానీ ప్రస్తుతం కేంద్రమంత్రులను కలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని వ్యాఖ్యానించారని సమాచారం. కేంద్రమంత్రుల కర్టసీ మీటింగులోను మన ఎంపీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. యనమల మాటలకు చంద్రబాబు ఏకీభవించారు. కేంద్రం ఏం చేస్తుందో చూద్దామని చెప్పారని తెలుస్తోంది. కేంద్రం ఏమివ్వాలనుకుంటుందో ఇవ్వనీయాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు.